HYD | మధురానగర్‌లో పేలిన సిలిండర్..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: మధురానగర్‌లోని కమాన్ గల్లీలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 12:30 గంటల సమయంలో రెండు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ దుర్ఘటనలో సోను భాయ్ (40) అనే మహిళ మృతి చెందింది.
ఈ పేలుడులో ఆమె తల్లిదండ్రులు గోపాల్ సింగ్, లలిత భాయ్ స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు.
సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి.నవీన్ యాదవ్ అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

