Himachal Accident | 8 మంది దుర్మరణం

Himachal Accident | 8 మంది దుర్మరణం
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
Himachal Accident | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హిమాచల్ ప్రదేశ్‌లో శనివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంబా జిల్లాలోని ప్రమాదకరమైన కొండ మార్గంలో ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి సుమారు 500 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా గుర్తించారు. రెండు కుంటుంబాలకు చెందిన వారు మంచును చూసేందుకు సచ్ పాస్‌కు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.
అధికారుల సమాచారం ప్రకారం, ఈ ప్రమాదం చంబా జిల్లాలోని చురాహ్ ఉపవిభాగం పరిధిలో ఉన్న బైరాగఢ్–సచ్ పాస్–కిల్లార్ రోడ్డుపై శుక్రవారం రాత్రి జరిగింది. అయితే ప్రమాదం జరిగిన విషయం స్థానికులకు శనివారం మధ్యాహ్నం తెలిసింది. వెంటనే పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. కారు పూర్తిగా ధ్వంసం కావడంతో సహాయక చర్యలు సవాలుగా మారాయి. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదానికి గురైన కారు సచ్ పాస్ వైపు వెళ్తుండగా లోయలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. సచ్ పాస్ హిమాచల్ ప్రదేశ్‌లో అత్యంత ప్రమాదకరమైన పర్వత మార్గాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రహదారులు ఇరుకుగా ఉండటంతో పాటు, లోతైన లోయలు, కఠినమైన మలుపులు ఉండటంతో ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన అధికారులు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదికను కోరినట్లు సమాచారం.
కొండ ప్రాంతాల్లో వర్షాలు, పొగమంచు, ప్రమాదకర రహదారులు కారణంగా వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సచ్ పాస్ వంటి ఎత్తైన పర్వత మార్గాల్లో అనుభవజ్ఞులైన డ్రైవర్లతోనే ప్రయాణించడం మంచిదని హెచ్చరిస్తున్నారు.
