పంటల మార్పిడితో అధిక దిగుబడి సాధ్యం..

జైనూర్, ఆంధ్రప్రభ : రైతులు పండించే పంటల్లో మార్పిడి విధానం పాటించడం ద్వారా అధిక దిగుబడితో పాటు భూసార పరిరక్షణ సాధ్యమవుతుందని తెలంగాణ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు డాక్టర్ గౌరీశంకర్, శివలక్ష్మి పేర్కొన్నారు.
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని దుబ్బగూడ గ్రామపంచాయతీలో సర్పంచ్ మడావి కౌసల్య భీమ్రావు అధ్యక్షతన రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు పంటల నాణ్యత మెరుగుపడుతుందని తెలిపారు.
పంటల సాగులో ఖర్చులు తగ్గించేందుకు తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడి వచ్చే పద్ధతులను అనుసరించాలని రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులను అధిక మోతాదులో వాడటం వల్ల కలిగే నష్టాలు, తక్కువ మోతాదులో వినియోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరించారు.
సేంద్రియ పద్ధతుల్లో పండించిన ధాన్యం, కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, పంటల మార్పిడి విధానంతో దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. మార్కెట్లో మంచి ధరలు లభించే పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుబ్బగూడ సర్పంచ్ మడావి కౌసల్య భీమ్రావు, ఏఈఓ టి. వినోద్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
