Musi River Development | మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి వేగం

Musi River Development | మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి వేగం
Musi River Development | మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో మరో ముందడుగు
గండిపేట నుంచి బాపూఘాట్ వరకు హద్దుల గుర్తింపు
ఆక్రమణలకు అడ్డుకట్ట వేయనున్న ప్రభుత్వం
భూసేకరణ, బఫర్ జోన్‌పై స్పష్టత
Musi River Development | హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మూసీ పునరుజ్జీవంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వం మూసీ డీపీఆర్ను ఇప్పటికే ఫైనల్ చేయగా, అవసరాలకు అనుగుణంగా అక్కడక్కడ మార్పులు – చేర్పులు జరుగుతున్నాయి. ఒక వైపు Asian Development Bank రుణానికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మరో వైపు మూసీ పునరుజ్జీవంలో భాగంగా చేపట్టాల్సిన ఒక్కో కార్యాచరణను పూర్తి చేసేందుకు ప్రభుత్వం, Musi Riverfront Development Corporation Limited ప్రత్యేక దృష్టిసారిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం భావించినట్టుగా గండిపేట నుంచి బాపూఘాట్ గాంధీ సరోవర్ దాకా ఫైనల్‌గా మూసీ హద్దులను నిర్ధారించే పనిలో నిమగ్నం కావడమే కాకుండా, హద్దు రాళ్లను ఏర్పాటు చేసే ప్రక్రియ మరింత వేగవంతంగా కొనసాగుతోంది. ఈ హద్దుల ఆధారంగా మూసీ నదికి 50 మీటర్ల బఫర్ జోన్‌ను ఎంఆర్డీసీఎల్ అధికారులు నిర్ధారించనున్నారు. మూసీ నదిపై ప్రభుత్వం చేపట్టదల్చిన ప్రభుత్వ కార్యాచరణకు మరింత స్పష్టత రానుంది.
హద్దుల ఖరారుతో స్పష్టత…
గండిపేట నుంచి బాపూఘాట్ వరకు 11 కి.మీ పొడవున, హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9 కి.మీ మొదటి దశ పనులు చేపట్టనున్నారు. గండిపేట జలాశయం దిగువ ప్రాంతం నుంచి బాపూఘాట్ వరకు మూసీ నది ప్రవాహ మార్గం, ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), బఫర్ జోన్లను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా ఇప్పటికే గుర్తించాయి.
ఉపగ్రహ చిత్రాలు, పాత రికార్డులు, భూ సర్వే పటాల ఆధారంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నివేదికలను ఆధారంగా చేసుకుని Musi Riverfront Development Corporation Limited క్షేత్రస్థాయిలో హద్దుల గుర్తింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం గండిపేట నుంచి నార్సింగి గోశాల వరకు సర్వే పూర్తి చేసి హద్దు రాళ్లను ఏర్పాటు చేశారు. మిగతా ప్రాంతాల్లో కూడా దశలవారీగా ఇదే ప్రక్రియ కొనసాగనుంది.
మూసా, ఈసా నదులు కలిసే బాపూఘాట్ వద్దకు గోదావరి జలాలను తరలించి త్రివేణి సంగమంగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. నదికి ఇరువైపులా విశాలమైన రోడ్లు, ఆకట్టుకునే పార్కులు ఏర్పాటు చేయనున్నారు.
సులువుగా భూసేకరణ…
మూసీ నది పరివాహక ప్రాంతాల్లో రెండు దశాబ్దాలుగా భారీ స్థాయిలో ఆక్రమణలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. నది ఒడ్డున నివాసాలు, కమర్షియల్ నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లు పెరగడంతో వరద ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని నిపుణులు చెబుతున్నారు. భారీ వర్షాల సమయంలో మూసీ ఉప్పొంగి పరిసర కాలనీలు ముంపుబారిన పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో హద్దు రాళ్ల ఏర్పాటు ద్వారా నది అసలు పరిధిని స్పష్టంగా నిర్ధారించి భవిష్యత్ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హద్దులలో ఉన్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కింద నది శుద్ధి, మురుగునీటి శాశ్వత పరిష్కారం, నది ఒడ్డున హరితవనాలు, వాకింగ్ ట్రాక్లు, వినోద కేంద్రాలు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి వంటి అనేక పనులు ప్రతిపాదించారు. బాపూఘాట్ వద్ద రూ.5,812 కోట్లతో గాంధీ సరోవరు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు రూ.1,684 కోట్లు, గండిపేట నుంచి గాంధీ సరోవర్ దాకా రూ.1,992 కోట్ల అంచనా వ్యయంతో Musi Riverfront Development Corporation Limited ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
అంతేకాకుండా, నదీ బఫర్ జోన్‌లో ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ ఉన్నట్టయితే.. ఆ ల్యాండ్ సేకరణకు ప్రభుత్వానికి, అధికారులకు సులువు కానుంది. ఈ పనుల అమలుకు నది అసలు హద్దులపై స్పష్టత అవసరం అని భావించిన అధికారులు హద్దు రాళ్ల ఏర్పాటు చేపడుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే భవిష్యత్తులో అభివృద్ధి పనులకు చట్టపరమైన అవరోధాలు తగ్గే అవకాశముంది. గండిపేట-నార్సింగి ప్రాంతంలో ప్రారంభమైన హద్దు రాళ్ల ఏర్పాటు త్వరలో నగరంలోని మిగతా మూసీ పరివాహక ప్రాంతాలకు విస్తరించనుంది. పూర్తి స్థాయిలో హద్దుల గుర్తింపు పూర్తయిన తర్వాత మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులు మరింత వేగం పుంజుకునే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
