హెచ్చరికల మధ్య హార్మ్‌ఫుల్ డైక్లోరైడ్ స్వాధీనం…

హెచ్చరికల మధ్య హార్మ్‌ఫుల్ డైక్లోరైడ్ స్వాధీనం…

కర్నూలు జిల్లాలో 60 రోజుల పాటు అమ్మకాలు నిలిపివేత.
24 శాతం ఎస్‌ఎల్‌ డైక్లోరైడ్ విక్రయాలపై జిల్లా వ్యవసాయ శాఖ కఠిన చర్యలు.హెచ్. వరలక్ష్మి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రైతుల ఆరోగ్యం, పంటల భద్రత దృష్ట్యా హార్మ్‌ఫుల్ డైక్లోరైడ్ 24% ఎస్‌ఎల్‌ కలుపు మందు విక్రయాలపై కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్‌టి నెం.421 ప్రకారం ఈ కలుపు మందు విక్రయాలను జిల్లాలో 60 రోజుల పాటు నిషేధిస్తూ జిల్లా వ్యవసాయ అధికారి పి.ఎల్‌. వరలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిషేధం 2026 మే 22 నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. 1968 కీటకనాశన నియమావళి ప్రకారం ప్రజల ఆరోగ్యం, రైతుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

అనంతపురం జిల్లాలో ఇటీవల పలువురు రైతులు, కూలీలు, పశువులు తీవ్ర అనారోగ్యానికి గురైన ఘటనల నేపథ్యంలో హార్మ్‌ఫుల్ డైక్లోరైడ్ 24% ఎస్‌ఎల్‌ వినియోగంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ హెచ్చరించింది. జిల్లాలోని అన్ని ఎరువుల, పురుగుమందుల దుకాణదారులు తమ వద్ద నిల్వలో ఉన్న సుమారు 8,950 లీటర్ల హార్మ్‌ఫుల్ డైక్లోరైడ్ 24% ఎస్‌ఎల్‌ నిల్వలను “అమ్మకానికి నిషేధితం” అని స్పష్టంగా గుర్తించి వేరుగా నిల్వ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ విక్రయాలు, రవాణాపై నిఘా పెట్టనున్నారు.

ప్రభుత్వం ఎందుకు నిషేధించింది?

హార్మ్‌ఫుల్ డైక్లోరైడ్ 24% ఎస్‌ఎల్‌ అనే కలుపు మందు పిచికారీ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా: చర్మం, కళ్లకు హాని కలగడం, శ్వాసకోశ సమస్యలు రావడం, పశువులపై ప్రతికూల ప్రభావం పడటం, అధిక మోతాదులో వినియోగిస్తే విషపూరిత ప్రభావాలు కనిపించడం, పర్యావరణానికి నష్టం కలగడం,
ఇటీవల రైతులు అనారోగ్యానికి గురైన ఘటనలు నమోదవడంతో ప్రభుత్వం తాత్కాలికంగా విక్రయాలపై నిషేధం విధించి భద్రతా ప్రమాణాలపై సమీక్ష చేపట్టింది. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి రక్షణ పరికరాలతోనే మందులను వినియోగించాలని అధికారులు సూచించారు.

Leave a Reply