17thMaychintana | భగవద్గీతలో ప్రవృత్తి-నివృత్తి తత్త్వం

17thMaychintana | భగవద్గీతలో ప్రవృత్తి-నివృత్తి తత్త్వం

17thMaychintana | ప్రవృత్తి ధర్మం అంటే ఏమిటి?
నివృత్తి మార్గం ద్వారా ఆత్మజ్ఞానం
గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థం వరకు
మోక్ష సాధనలో ధర్మ మార్గాల ప్రాధాన్యం

17thMaychintana | మనం ఆచరించవలసిన ధర్మాలలో ప్రవృత్తి ధర్మం, నివృత్తి ధర్మం అనేవి పేర్కొనబడ్డాయి. సనాతన ధర్మంలో “ప్రవృత్తి” అంటే మనస్సును బాహ్యప్రపంచ విషయాల వైపు ఉంచడం. (బహిర్ముఖం అన్నమాట) మన చుట్టూ ఉన్న లౌకిక విషయాలపై దృష్టి పెడుతూనే, బహిర్ముఖమైన వివిధ కర్మలను ధర్మంగా ఆచరిస్తూ, భగవంతుని తత్త్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం. అంటే గృహాశ్రమ ధర్మం పాటిస్తూ, కర్తవ్యాలు పూర్తి అయిన తరువాత వానప్రస్థాశ్రమంలో ముక్తికి తపిస్తూ, భగవదారాధన చేయడం, ఆయన నామాన్ని తపస్సుగా జపించడం. ఒక రకంగా చెప్పాలంటే ప్రవృత్తి ధర్మం భక్తి-కర్మల సమ్మిళితమే.

ఇక నివృత్తి అంటే మనం మనలోకి చూడడం. అంటే ఆత్మ పరిశీలన, ఆత్మావలోకనం చేయడం. మనం చేసిన కర్తవ్యం లేదా కర్మ ధర్మబద్ధంగా చేశానా? లేదా? ఎక్కడ దోషం జరిగింది? అని మనలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం. అలా చేసుకోవడం ఆత్మజ్ఞానాన్వేషణకు నాంది అయి, భగవంతుని తత్త్వ రహస్యాన్ని తెలుసుకుంటాం. ఇది బాహ్య విషయాలపై అంత ఆశక్తి చూపదు.

బాగా ఆలోచిస్తే ప్రవృత్తి అంటే “నేను-నాది-నా కుటుంబం” అంటూ స్వార్థంతో, వ్యామోహంతో జీవించడం. అదే నివృత్తిలో “నేను చేసేది అంతా పరమాత్మ లీలే! ఆయనే నా చేత చేయిస్తున్నాడు” అనే భావనతో కర్తవ్యాలను చేయడం. భగవంతుని ప్రీతి కొరకు, దయ కొరకు వెంపర్లాడటం.

“ద్వివిధో హి వేదోక్తో ధర్మః ప్రవృత్తి నివృత్తి లక్షణః | జగతః స్థితి కారణం” అని సనాతన ధర్మం చెబుతోంది.

అంటే ప్రవృత్తి, నివృత్తి ధర్మాల సమన్వయంలోనే జగత్తు సజావుగా ముందుకు సాగుతుందని అర్థం. భగవద్గీతలో 18వ అధ్యాయం 58వ శ్లోకంలో పరమాత్మ “మచ్చిత్తః సర్వదుర్గాణి మత్‌ప్రసాదాత్ తరిష్యసి” అని ఉపదేశించారు. అంటే చిత్తాన్ని భగవంతుని యందే నిలిపితే, ఆయన అనుగ్రహంతో సంసారంలోని సమస్త దుఃఖాలను దాటి పరమాత్మను పొందగలవు. కాని అహంకారాన్ని వదలకపోతే అనవసరంగా చిక్కుల్లో పడతావని చెప్పారు.

17thMaychintana

దీనిలో రెండు మార్గాలను పరమాత్మ చూపించారు. ముందుగా నివృత్తి మార్గాన్ని సూచించారు. అంటే భగవంతుని యందే మనసును లగ్నం చేయాలని చెప్పారు. తరువాత ప్రవృత్తిలో ఉండే గుణాలకు నీవు లోబడే ఉంటావని వివరించారు. అందుకే మనం గృహస్థాశ్రమం తరువాత వానప్రస్థాశ్రమంలో సమాజానికి దూరంగా ఆత్మజ్ఞానం కొరకు భగవత్ తత్త్వాన్ని తెలుసుకోవాలి. ఇదే ప్రవృత్తి నుంచి నివృత్తికి మార్పు చెందడం.

నివృత్తికి శరీర శుద్ధి, ఇంద్రియ శుద్ధి, ఆత్మశుద్ధి, ప్రాణశుద్ధి అవసరం. అందుకే నిశ్చల మనస్సుతో ధర్భాసనంపై కూర్చుని మంత్రజపం చేయడం వల్ల నిశ్చల స్థితి వస్తుంది. ప్రవృత్తిలో కూడా దానధర్మాలు చేస్తూ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ, భౌతిక ప్రయోజనాలకు ధర్మమార్గాన్ని అనుసరిస్తూ, ఇష్టదైవాన్ని స్తుతించడమో, శరణాగతి పొందడమో చేస్తే అంతిమ లక్ష్యం అయిన మోక్షం సిద్ధిస్తుంది.

మహాభారతంలో భీష్ముడు మోక్షధర్మాలను ఉపదేశిస్తూ, ప్రవృత్తి ధర్మాన్ని నివృత్తి ధర్మం కంటే తక్కువగా భావించకూడదని వివరించారు. ప్రముఖ వాగ్గేయకారుడు పురందరదాసు ముందుగా వజ్రాల వ్యాపారం చేస్తూ ప్రవృత్తి మార్గంలో బాగా సంపాదించాడు. అక్కరకు రాని సంపద వల్ల ఉపయోగం లేదని సాక్షాత్తు పాండురంగడే బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆయనను నివృత్తి మార్గంలోకి తీసుకువచ్చాడని చెబుతారు.

మనం కొంతమంది జీవిత చరిత్రలు చూస్తే ప్రవృత్తి నుంచి నివృత్తి మార్గానికి వచ్చినవారు, చిన్నప్పటి నుంచే పూర్వజన్మ సుకృతం వల్లనో, తల్లిదండ్రుల అనుసరణ వల్లనో నివృత్తి మార్గంలోనే సిద్ధి పొందినవారు ఉన్నారు. తిరువణ్ణామలై రమణ మహర్షి, ఆది శంకరులు, భక్త తుకారాం, వల్లభాచార్యులు, చైతన్య మహాప్రభువు ఇలా చాలామంది గోచరిస్తారు. మనం ఈ రెండు ధర్మ మార్గాల్లో ఏది ఎంచుకున్నా భగవంతుని తత్త్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చు.

శుభం భూయాత్.

— అనంతాత్మకుల రంగారావు
7989462679

CLICK HERE TO READ may16chintana | కోరిక – అభ్యున్నతికి మూలమా? పతనానికి కారణమా?

CLICK HERE TO READ MORE