తొలిరోజే పాఠ్యపుస్తకాల పంపిణీ..
మేడ్చల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమైన తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమం మేడ్చల్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులే దేశ భవిష్యత్తని, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రంలో విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోందని తెలిపారు.
ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు ద్వారా పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను ఉచితంగా అందించాలనే మహత్తర లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక మౌలిక వసతుల కల్పన, డిజిటల్ విద్య, మెరుగైన బోధనా పద్ధతులను ప్రవేశపెడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి మంజుల, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
