తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా జనసేన పార్టీ
తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా జనసేన పార్టీ
చిట్యాల, ఆంధ్రప్రభ : రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదగడం ఖాయమని, భూపాలపల్లి జనసేన పార్టీ జిల్లా నాయకులు కంకణాల దేవేందర్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, జనసేన నవనిర్మాణ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం తగదన్నారు. శాంతిభద్రతల పేరుతో సభకు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక రోడ్లపై ఆందోళనలు చేస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం విచారకరమన్నారు.
జనసేనను అడ్డు కోవడం తగదని…తెలంగాణ యువత గత 12 సంవత్సరాలుగా అవకాశవాద రాజకీయాలను గమనిస్తోందని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించి అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని, ప్రజల స్వేచ్ఛను, రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాయడం మానుకోవాలన్నారు. జనసేన పార్టీని లక్ష్యంగా చేసుకుని రాజకీయ కుట్రలు చేసే వారికి ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టేకుమట్ల మండల కో-ఆర్డినేటర్ జంగా మధుకర్ పాల్గొన్నారు.
