Social Media Trap | లైక్‌లతో దగ్గరవుతున్న ఉగ్రమూకలు
Social Media Trap | లైక్‌లతో దగ్గరవుతున్న ఉగ్రమూకలు
Social Media Trap | మేడ్చల్, చంచల్‌గూడ ఘటనలతో వెలుగులోకి వచ్చిన ట్రాప్
వ్యక్తిగత మెసేజ్‌లతో యువతను ముగ్గులోకి దింపుతున్న నెట్‌వర్క్
విజయనగరం బాంబు కుట్ర కేసుతో బయటపడిన అసలు విషయం
జాతి వ్యతిరేక పోస్టులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన
Social Media Trap | హైదరాబాద్, ఆంధ్రప్రభ: సోషల్ మీడియాలో పోస్టు నచ్చిందని లైక్ కొట్టారో ఇక అంతే సంగతులు. అసలు దాని ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండా స్పందిస్తే ఉగ్రవాదం కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా జరుగుతున్న ఘటనలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. కొందరు ఉగ్రవాదులు సోషల్ మీడియా మాటున విసురుతున్న వలలో చిక్కుకొని అమాయకులు విలవిల్లాడుతున్నారు.
మేడ్చల్‌లోని ఓ హోటల్‌లో సర్వర్‌గా పని చేసే యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన జయూద్ ఖాన్ (22) ఖాళీ సమయాల్లో బొమ్మ తుపాకులతో రీల్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుండేవాడు. అతడి పోస్టులకు పాక్‌లోని ఐఎస్ఐ సానుభూతిపరులు హబీబ్, రాణా హుస్సేన్ లైక్‌లతో దగ్గరయ్యారు. తర్వాత ఉగ్రవాదం వైపు రెచ్చగొట్టారు. అతడి వాలకాన్ని గమనించిన మేడ్చల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్ చంచల్‌గూడకు చెందిన సయిదా బేగం (38) భర్త నుంచి వేరుపడి ఇళ్లలో పని చేసుకుని బతుకుతోంది. ఖాళీ సమయంలో రీల్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేది. ఆమె రీల్స్‌కు లైకులు కొట్టడం ద్వారా దగ్గరైన పాకిస్థాన్ ఉగ్రవాద మూకలు క్రమంగా ఆమెలో అదే తరహా భావజాలం నూరిపోశారు.
వ్యక్తిగత మెసేజ్‌లతో ముగ్గులోకి
మరి కొంతమంది మహిళలను ఆకట్టుకునేలా సయిదా బేగంతో రీల్స్ చేయించారు. దేశవ్యాప్తంగా మొత్తం 42 మహిళలతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి, వారి ద్వారా విధ్వంసానికి కుట్రపన్నారు. విజయవాడకు చెందిన యువకులను అరెస్టు చేసినప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఏపీలోని విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమయ్యేందుకు హైదరాబాద్ వచ్చి సోషల్ మీడియాలో జాతి వ్యతిరేక భావాలున్న పోస్టులకు ఆకర్షితుడయ్యాడు. సిరాజ్ ఉద్దేశాన్ని గమనించిన పాక్ ఉగ్రవాద మూకలు, అతడిని నెమ్మదిగా వ్యక్తిగత మెసేజ్‌లతో ముగ్గులోకి దింపాయి. ఇలాంటి భావాలే ఉన్న హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సమీర్‌ను పరిచయం చేశాయి.
బిహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ నేతృత్వంలో ఇలాంటి భావనతోనే ఉన్న మరికొందరు కలిసి దేశవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడేందుకు సిద్ధమయ్యారు. 2025 మే 21న విజయనగరంలో బాంబు పేల్చాలని కుట్ర చేయగా, అంతకు 5 రోజుల ముందు విజయనగరం పోలీసులు సిరాజ్‌ను అరెస్టు చేశారు. తర్వాత గల్ఫ్ దేశాలకు పారిపోతున్న ఆరిఫ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన సయ్యద్, మరికొందరిని కూడా అరెస్టు చేశారు.
అనుకూల భావజాలం ఉన్నవారిని గుర్తించేందుకే…
ఉగ్రవాదులు తమకు అనుకూలమైన వారిని ఆన్‌లైన్‌లో గుర్తిస్తున్నారు. ఈ విధానానికి పెట్టిన పేరే మ్యాజిక్ లాంతర్. అంతర్జాల ప్రపంచంలో ఉగ్రమూకలు ఉద్దేశపూర్వకంగానే కొన్ని రెచ్చగొట్టే పోస్టులు పెడతాయి. వీటికి ఒకరిద్దరు మాత్రం అనుకూలంగా స్పందిస్తారు. పోస్టు పెట్టకపోయినా లైక్ చేస్తారు. ఇలాంటి వారిని తమ దారికి తెచ్చుకుని విధ్వంసం దిశగా ఉగ్రమూకలు సిద్ధం చేస్తాయి.
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్నవారిలో తమకు పనికొస్తారని భావించిన వారిని గుర్తిస్తారు. వారి పోస్టులకు లైకులు కొట్టి దగ్గరవుతారు. తామేం చేస్తున్నామో తెలుసుకునేలోపే చాలామంది ఆ ఊబిలో కూరుకుపోతున్నారు. దర్యాప్తు సంస్థలు కూడా ఇలాంటి వారిని సులభంగానే గుర్తిస్తున్నాయి. అందుకే జాతి వ్యతిరేక భావజాలం, సంఘ విద్రోహ సమాచారం వంటివి కనిపించినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సందేశాలు కనిపించిన వెంటనే వాటి నుంచి బయటకు రావడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.
