వట్టెం రిజర్వాయర్ వద్ద ఏర్పాట్ల పరిశీలన..
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన వట్టెం వెంకటేశ్వర రిజర్వాయర్ పంప్‌హౌస్‌ను సందర్శించనున్న నేపథ్యంలో బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, వనపర్తి జిల్లా ఎస్పీ సునీతా రెడ్డిలు సంయుక్తంగా ఏర్పాట్లను పరిశీలించారు.
నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని కుమ్మెర గ్రామ సమీపంలో ఉన్న వట్టెం వెంకటేశ్వర రిజర్వాయర్, పంప్‌హౌస్ ప్రాంతాలను ముఖ్యమంత్రి ఈ నెల 5న సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్, హెడ్ రెగ్యులేటర్, నార్లాపూర్ రిజర్వాయర్, డెలివరీ సిస్టమ్, ఎంజీకేఎల్ఐ లిఫ్ట్-1 పంప్‌హౌస్‌ను పరిశీలించనున్నారు.

అనంతరం హెలికాప్టర్ ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్, హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజీ-3 కాలువ పనులు, ఏదుల రిజర్వాయర్ పంప్‌హౌస్ పనులను పరిశీలించిన తర్వాత కుమ్మెరకు చేరుకుంటారు. అక్కడ వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించిన ప్యాకేజీ-8, 9, 10, 11 పనులను తనిఖీ చేయనున్నారు.
ఈ సందర్భంగా కుమ్మెర గెస్ట్ హౌస్‌లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించిన అధికారులు, భద్రతా ప్రమాణాలు, వాహనాల పార్కింగ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధుల కోసం కల్పిస్తున్న సౌకర్యాలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

అనంతరం వట్టెం రిజర్వాయర్ పంప్‌హౌస్ వద్ద నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి ప్రయాణ మార్గాలు, భద్రత, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ తరఫున పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సున్నిత ప్రాంతాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నట్లు పేర్కొన్నారు. వాహనాల తనిఖీలు, ప్రవేశ నియంత్రణ, ట్రాఫిక్ మళ్లింపులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.
వనపర్తి జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి కూడా భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించి, శాఖల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
