కేరళ లాటరీ పేరుతో రూ.4.10 లక్షల సైబర్ మోసం

కేరళ లాటరీ పేరుతో రూ.4.10 లక్షల సైబర్ మోసం

ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం పట్టణంలోని ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్‌లో సైబర్ మోసానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని ప్రశాంతినగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి అనధికారికంగా డబ్బులు సైబర్ మోసగాళ్లు మాయం చేశారని ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదుదారుడి కథనం ప్రకారం.. బాధితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన కేరళ లాటరీ ప్రకటనను క్లిక్ చేసి నాలుగు లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. అనంతరం ఆ టికెట్లను వాట్సాప్ ద్వారా అతనికి పంపించారు. తాను కొనుగోలు చేసిన లాటరీ టికెట్లకు రూ.12,00,000 గెలుచుకున్నట్లు తెలిపి, ఆ మొత్తాన్ని పొందాలంటే టాక్స్ చెల్లించాలని మోసగాళ్లు నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు రూ.4,10,351ను సైబర్ మోసగాళ్లకు పంపించాడు.

దీంతో ఆ మొత్తాన్ని కోల్పోయిన బాధితుడు, అనంతరం అవతలి వ్యక్తుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఖానాపురం హవేలి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ సెంటర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయించారు. ఈ మేరకు ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్‌లో క్రైం నెం. 297/2026గా U/s. 318(4) BNS, 66D IT Act కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఖమ్మం టౌన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రమణమూర్తి ప్రజలకు పలు సూచనలు చేశారు. అధిక లాభాలు వస్తాయని, లాటరీలు లేదా బహుమతులు గెలిచారని చెప్పి నిరుద్యోగులు, గృహిణులు, ఇతర అమాయక ప్రజలను ప్రలోభపెట్టి సైబర్ నేరగాళ్లు వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారని పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టే ముందు వాటి వాస్తవికతను పరిశీలించాలని, అనధికారిక APK ఫైళ్లను క్లిక్ చేయవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల ద్వారా బాధితుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి సైబర్ నేరాలపై అవగాహనతో వ్యవహరించాలని కోరారు.

Leave a Reply