లేబర్‌ కోడ్‌లను నిరసిస్తూ గోదావరిఖనిలో జైల్‌భరో

రహదారిపై రాస్తారోకో నిర్వహించిన సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ

గోదావరిఖని, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో లేబర్‌ కోడ్‌లను వ్యతిరేకిస్తూ సోమవారం జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. రాజీవ్‌ రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు.

ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రతినిధులు వీరయ్య, తుమ్మల రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే పోరాట కార్యక్రమాల్లో కార్మిక వర్గం కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ నాయకులు నరేష్‌, రైతు కూలీ సంఘం నాయకులు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.