ఉచితంగా ఇంటింటికీ మంచినీటి సరఫరా..

వికారాబాద్, ఆంధ్రప్రభ : అన్నదాతల కోసం, సామాన్య ప్రజల దాహం తీర్చేందుకు ‘యువ చైతన్యం’ ట్రస్ట్ ముందడుగు వేసింది. బంట్వారం మండలం రోంపల్లి గ్రామంలో నెలకొన్న తీవ్రమైన మంచినీటి కొరతను గమనించి, ట్రస్ట్ చైర్మన్, బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు మరియు ప్రముఖ న్యాయవాది చైతన్య కిరణ్ మల్కాపురం ఒక వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

గత 20 రోజులుగా గ్రామంలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పందించేలోపే చైతన్య కిరణ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, తన సొంత వనరులతో గ్రామ ప్రజలకు నీటి సరఫరా ప్రారంభించారు.

వేసవి తీవ్రత కారణంగా గ్రామంలోని బావులు ఎండిపోవడంతో, ఆయన తన సొంత ఫామ్ బావి నుండి నీటిని గ్రామ ప్రజల కోసం అందిస్తున్నారు. ‘యువ చైతన్యం’ ట్రస్ట్ ఆధ్వర్యంలో సొంత ఖర్చుతో ట్రాక్టర్, ట్యాంకర్ ఏర్పాటు చేసి, ప్రతి వీధిలో ఇంటింటికీ ఉచితంగా మంచినీటిని సరఫరా చేస్తున్నారు.

గ్రామంలో నీటి సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఈ ఉచిత ట్యాంకర్ సేవలు నిరంతరంగా కొనసాగుతాయని ట్రస్ట్ స్పష్టం చేసింది. అత్యంత క్లిష్ట సమయంలో ఆపద్బాంధవుడిలా ముందుకు వచ్చిన చైర్మన్ చైతన్య కిరణ్ మల్కాపురం సేవలను రోంపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసించారు. పదవుల కంటే ప్రజాసేవకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రోంపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చందు సింగ్, సీనియర్ నాయకులు మల్లేషం, నరేష్, శ్రీశైలం, శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని నీటి పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.