ఎస్సీ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ ప్రారంభం

  • సంక్షేమ పథకాల సమాచారం.. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు సౌకర్యం
  • నిరుద్యోగ యువత, నర్సింగ్ విద్యార్థులకు ప్రత్యేక అవకాశాలు

అమరావతి, ఆంధ్రప్రభ: ఎస్సీ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ప్రారంభించారు. ఎస్సీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల పూర్తి సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకువచ్చేలా వెబ్‌సైట్‌ను రూపొందించారు.

వివిధ సంక్షేమ పథకాలకు సులభతరంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు. అర్హులైన వారు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వెబ్‌సైట్‌ ద్వారా పథకాల వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇజ్రాయిల్ భాషల్లో ఉచిత శిక్షణ పొందేందుకు కూడా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అదేవిధంగా నిరుద్యోగ ఎస్సీ యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయం అందుబాటులో ఉందన్నారు.

ఎస్సీ వర్గాలకు చెందిన ఔత్సాహికులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకుని తమకు అర్హత ఉన్న సంక్షేమ, శిక్షణా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు.