అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ
- అవయవదానాన్ని ప్రోత్సహించాలి
- ప్రపంచ అవయవదాన దినోత్సవంలో పి.ఎం.పి సంఘం పిలుపు
గణపవరం, ఆంధ్రప్రభ: అవయవదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుని, దానిని ప్రోత్సహించాలని రాష్ట్ర పి.ఎం.పి సంఘం గౌరవ అధ్యక్షుడు ఎన్. జయసూర్య పిలుపునిచ్చారు. ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గణపవరం మండలం సరిపల్లి గ్రామంలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, పి.ఎం.పి అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు ఎం. సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో అవయవదానంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు . అనంతరం జిల్లా పి.ఎం.పి సంఘ అధ్యక్షుడు ఏ.ఆర్.కే. పరమేశ్వరులు మాట్లాడుతూ.. 1967లో ప్రపంచంలో తొలిసారిగా గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగిందన్నారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆగస్టు 13న ప్రపంచ అవయవదాన దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మనిషి శరీరంలోని కీలక అవయవాలు పనిచేయని పరిస్థితుల్లో అవయవ మార్పిడి ద్వారా బాధితులకు కొత్త జీవితాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. మరణానంతరం కళ్ళు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు తదితర అవయవాలతో పాటు అవసరమైన కణజాలాలను దానం చేయవచ్చన్నారు. ఒక వ్యక్తి మరణానంతరం అవయవదానం ద్వారా పలువురికి జీవితం ప్రసాదించే అవకాశం ఉందని తెలిపారు.
ప్రజలు అవయవదానంపై ఉన్న అపోహలను తొలగించుకుని, అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వి. శివ శ్రీనివాసరావు, కే. అప్పారావు, మస్తాన్వలి, పానకాలు, గోపాలకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
