చిన్నారుల సంరక్షణలో అంగన్వాడీలదే కీలకపాత్ర

  • అమ్మ స్థానంలో ఉండి పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించాలి
  • జ్ఞానజ్యోతి శిక్షణలో సీడీపీవో లక్ష్మీ భార్గవి

నందిగామ రూరల్, ఆంధ్రప్రభ: చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల, మానసిక వికాసంలో అంగన్వాడీ కేంద్రాలు అమ్మ స్థానంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని సీడీపీవో లక్ష్మీ భార్గవి అన్నారు. నందిగామలోని జిల్లా పరిషత్ పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహించిన జ్ఞానజ్యోతి శిక్షణా తరగతులు గురువారం ముగిశాయి.

ఈ సందర్భంగా లక్ష్మీ భార్గవి మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్తలు తల్లి స్థానంలో ఉండి చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల, మేధో వికాసంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆటపాటల ద్వారా పిల్లలను చురుకుగా తీర్చిదిద్దడంతో పాటు వారి ఆరోగ్య సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

పిల్లలకు విద్యతో పాటు మేధో వికాసం కలిగించే విధానాలపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. నవచేతన ఆధారశిల యాప్ వినియోగంపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. శిశువుల్లో వివిధ దశల్లో జరిగే శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి సంబంధించిన అంశాలను వివరించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ వెంకటరావమ్మతో పాటు పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.