భీమవరంలో టిడిపి నేతల రచ్చ..

టీడీపీలో ఆక్వా ఆవేశాలు.. ఆరోపణలు..
పార్టీలో ఉంటూ పార్టీకే వ్యతిరేకంగా కార్యక్రమాలా..
రైతు ముసుగేసుకుని మేత బస్తాలు తగలబెట్టడం తగదు..
చంద్రశేఖర్ పై విమర్శలుచేసిన వీరవాసరం టీడీపీ మండల అధ్యక్షుడు కొల్లేపర శ్రీనివాస్
అయితే ఏం.. పీ… అన్న వీరవల్లి చంద్రశేఖర్
జిల్లా అధ్యక్షుడు రామరాజు, నియోజకవర్గ ఇంచార్జ్ సీతారామలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ సమక్షంలోనే వాగ్వాదం

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన థాంక్యూ లోకేష్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నారా లోకేష్ పాదయాత్రలో ఆక్వా రైతులకు ఇచ్చిన హామీని ప్రస్తుతం అమలు చేయడంతో భీమవరం ప్రకాశం చౌక్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో థాంక్యూ లోకేష్ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొల్లెపర శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు వీరవల్లి చంద్రశేఖర్ లు నువ్వేం చేస్తావ్ అంటూ.. నువ్వేం చేస్తావ్ అంటూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఈ విమర్శలన్నీ సాక్షాత్తు జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు, నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ముందే రచ్చ జరిగింది.

ఆక్వా రైతుల ముసుగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు పని చేస్తున్నారని, ఇది సరికాదని వీరవాసరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఏదైనా ప్రభుత్వ అండగా నిలబడాల్సిన నాయకులే ఆక్వారైతుల ముసుగులో మేత బస్తాలు తగలబెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు వీరవల్లి చంద్రశేఖర్ కల్పించుకుని మాట్లాడారు.

నువ్వు రైతువా… రైతులు ముసుగులో కాదు నేనా.. నేనే అని అంటూ.. ఏం ..పీ… అంటూ మేతల బస్తాలు తగలబెట్టింది నేనే అంటూ.. ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలో తరచూ జరుగుతున్న ఈ వాగ్వాదాలు తీవ్ర చర్చి నియాంసంగా మారుతున్నాయి. పార్టీలో ఉన్న లోపాలు.. నాయకులు మధ్య ఉన్న అంతర్గత విభేదాలను ఇటువంటి కార్యక్రమాల్లో బహిర్గతం అవుతున్నాయి. జిల్లా కేంద్రమైన భీమవరం పై అధిష్టానం దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో నెలకొని ఉన్న ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.