నిరుపేద కుటుంబానికి జీవనోపాధి బండి అందజేత

  • ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దంపతులకు అండగా వైఎన్‌ఆర్‌ చారిటీస్‌
  • తోపుడు బండి అందించిన సంస్థ చైర్మన్‌ యలమంచిలి జయప్రకాష్‌

విజయవాడ, ఆంధ్రప్రభ: ఆర్థిక ఇబ్బందులతో జీవనోపాధికి సతమతమవుతున్న నిరుపేద కుటుంబానికి వైఎన్‌ఆర్‌ చారిటీస్‌ అండగా నిలిచింది. నూజివీడు నియోజకవర్గం తోటపల్లికి చెందిన సొంగ సత్యవతి, సొంగ రంగారావు దంపతులు అమ్మ కళ్యాణ మండపం సమీపంలో పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా మారడంతో తమ జీవనోపాధిని కొనసాగించేందుకు సహాయం కోరుతూ వైఎన్‌ఆర్‌ చారిటీస్‌ సంస్థను సంప్రదించారు. వైఎన్‌ఆర్‌ చారిటీస్‌ సేవల గురించి తెలుసుకున్న సత్యవతి, రంగారావు సంస్థ చైర్మన్‌ యలమంచిలి జయప్రకాష్‌ను సంప్రదించగా ఆయన వెంటనే స్పందించారు.

దంపతులు స్వయంగా కష్టపడి జీవనం సాగించేందుకు అవసరమైన పండ్ల విక్రయ తోపుడు బండిని సంస్థ కార్యాలయం వద్ద వారికి అందజేశారు. దీంతో ఇకపై పండ్ల విక్రయాన్ని కొనసాగిస్తూ స్వయం ఉపాధి ద్వారా కుటుంబాన్ని పోషించుకునేందుకు వారికి అవకాశం ఏర్పడింది.

ఈ సందర్భంగా యలమంచిలి జయప్రకాష్‌ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు కేవలం తాత్కాలిక సహాయం అందించడం కంటే, వారు స్వయంగా ఆదాయం సమకూర్చుకునేలా జీవనోపాధి మార్గాలను కల్పించడం వైఎన్‌ఆర్‌ చారిటీస్‌ లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. అవసరంలో ఉన్నవారు తమ సంస్థను సంప్రదిస్తే సాధ్యమైన మేరకు సహాయం అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

జీవనోపాధి కోసం తోపుడు బండి అందించినందుకు సొంగ సత్యవతి, సొంగ రంగారావు వైఎన్‌ఆర్‌ చారిటీస్‌ చైర్మన్‌ యలమంచిలి జయప్రకాష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని, పండ్ల విక్రయంతో వచ్చిన ఆదాయంతో కుటుంబ అవసరాలను తీర్చుకుంటామని తెలిపారు.