KING | రైతును రాజును చేసే పంచ సూత్రాలు..

KING | రైతును రాజును చేసే పంచ సూత్రాలు..
- అయిదు విధానాలతో స్పష్టమైన కార్యాచరణ
- రైతన్నా.. మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- అగ్రీ టెక్‌కు అన్నదాతలు చేరువకావాలి
- సాగు విధానాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలి
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
KING | పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : వచ్చే అయిదేళ్లలో రైతును రాజును చేసేందుకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రీటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్ధతు అనే అయిదు విధానాలతో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశ.. వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో కలిసి పెనుగంచిప్రోలు (Penuganchiprol) మండలం, శనగపాడు రైతుసేవా కేంద్రంలో మంగళవారం జరిగిన రైతన్నా.. మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతన్నా.. మీ కోసం కార్యక్రమం అమలు లక్ష్యాలను అధికారులు వివరించారు. ఆత్మీయులైన అన్నదాతలకు నా హృదయపూర్వక నమస్సులు.. మీరు పండించే ప్రతి గింజ, ప్రతి పంటా మన రాష్ట్రానికి బలం అంటూ వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధికి ప్రభుత్వం చూపుతున్న చొరవను వివరిస్తూ ముఖ్యమంత్రి రాసిన లేఖను చదివి వినిపించారు.
వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, చీడపీడల నియంత్రణ, సాగునీటి సక్రమ నిర్వహణ, వాతావరణ సూచనలు.. ఇలా వివిధ అంశాలు నిక్షిప్తమైన, రైతులకు ప్రయోజనకారిగా ఉండే ఏపీ ఏఐఎంఎస్ యాప్ (AP AIIMS App) గురించి కూడా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. సమాజంలో నేడు మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా అన్నదాతలు సాగు పద్ధతులను మార్చుకోవాలని, చిరుధాన్యాల సాగుతో పాటు ఉద్యాన పంటలపైనా దృష్టిసారించాలన్నారు. సాగుకు సాంకేతికత తోడైతే తిరుగుండదని.. అందుకే అగ్రీ టెక్ విధానాలను అనుసరించాలని సూచించారు. డ్రిప్, స్ప్రింకర్ల సేద్యాన్ని విస్తరించి, నీటి వినియోగ సామర్థ్యాన్ని 40 శాతం 50 వరకు పెంచి రైతు ఉత్పాదకతలో ప్రగతికి ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు.
అన్నదాతలు అగ్రీప్రెన్యూర్‌గా ఎదగాలని.. తమ ఉత్పత్తులకు విలువను జోడిస్తే మార్కెట్లో అధిక ధరలు లభిస్తాయన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలుచేస్తున్న అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన (PM Crop Insurance Scheme) వాతావరణ ఆధారిత పంటల బీమా తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు పంటల సాగుతో పాటు పాడి పశువుల పెంపకంపైనా దృష్టిసారించడం ద్వారా అదనపు ఆదాయాలను పొందవచ్చన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యాన పంటల సాగును ఉచితంగా చేపట్టవచ్చని.. అందువల్ల రైతులు ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ప్రకృతి సేద్యం సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
