మేడిగడ్డ వద్ద ఎల్‌అండ్‌టీలో అగ్నిప్రమాదం

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ సమీపంలోని అంబట్‌పల్లి గ్రామం వద్ద ఉన్న ఎల్‌అండ్‌టీ సంస్థకు చెందిన ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు.

సమీపంలోని వరి పొలాల్లో రైతులు వ్యవసాయ అవశేషాలు, పొలాల చెత్తకు నిప్పంటించడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించి గెస్ట్ హౌస్ పరిసరాలకు చేరుకున్నట్లు సమాచారం. గాలివేగానికి మంటలు మరింత విస్తరించడంతో గెస్ట్ హౌస్‌లోని కొంత భాగం దగ్ధమైనట్లు తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే అగ్నికి ఆహుతైన భవనం సాగునీటి శాఖ కార్యాలయం గానీ, ప్రభుత్వ ఆస్తి గానీ కాదని అధికారులు స్పష్టం చేశారు. అది ఎల్‌అండ్‌టీ సంస్థకు చెందిన ప్రైవేట్ గెస్ట్ హౌస్ మాత్రమేనని తెలిపారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు

Leave a Reply