160 కి.మీ అల్ట్రా రన్, సైక్లింగ్ పోస్టర్ ఆవిష్కరణ..
- ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ అథ్లెట్, మోడర్న్ పెంటాథ్లాన్ జాతీయ క్రీడాకారుడు గోవింద్‌రాజు కొక్కిరిపాటి (రాజు కె.) చేపట్టిన ‘160 కిలోమీటర్ల అల్ట్రా రన్ అండ్ సైక్లింగ్ ఛాలెంజ్’ అధికారిక పోస్టర్‌ను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు.
ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ‘రన్ ఫర్ ఫ్రీడమ్–రైడ్ ఫర్ ప్రైడ్’ నినాదంతో ఈ అల్ట్రా ఎండ్యూరెన్స్ ఛాలెంజ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఘన విజయం సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.
ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నంలోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, జెండా వీరుడు తోట నరసయ్య స్వగృహం నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి వరకు 80 కిలోమీటర్ల అల్ట్రా రన్ నిర్వహించనున్నారు. అనంతరం 15వ తేదీ ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వరకు 80 కిలోమీటర్ల సైక్లింగ్ చేపట్టనున్నారు.
మొత్తం 160 కిలోమీటర్ల మేర రన్, సైక్లింగ్ నిర్వహించేందుకు రాజు కె. తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని మంత్రి కొల్లు రవీంద్ర అభినందించారు. క్రీడాభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రాజును ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారిణి ఝాన్సీ, సీనియర్ జర్నలిస్ట్ ముదిగొండ శాస్త్రి, శిష్టకరణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు అక్కమహంతి రాజా తదితరులు పాల్గొన్నారు.
