యూనిట్‌కు రూ.1.50 చొప్పున రాయితీ
- అర్హులైన రైతులందరికీ వర్తింపు
- ఆక్వా రంగాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: మంత్రి అచ్చెన్నాయుడు
పాలకొల్లు, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ఆక్వా రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే తేడా లేకుండా అర్హులైన ఆక్వా రైతులకు విద్యుత్‌పై యూనిట్‌కు రూ.1.50 చొప్పున సబ్సిడీ అందించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
పాలకొల్లు బ్రాడీపేట బైపాస్ రోడ్డులో మంగళవారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఆక్వా రైతుల కృతజ్ఞత మహాసభలో అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 10 ఎకరాలకు పైబడిన ఆక్వా సాగుదారులకు యూనిట్ విద్యుత్‌కు రూ.1.50 సబ్సిడీ అమలు చేయనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయని చెప్పారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ నిబంధనలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న రైతులందరికీ ఈ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన మద్దతుతోనే అధికారంలోకి వచ్చామని మంత్రి పేర్కొన్నారు. 2024లో ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే సమయానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండేదని, అయినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేశారని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన హామీలను కూడా దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సాగునీటి వ్యవస్థను మరింత ఆధునికీకరించడంతో పాటు రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 26 నెలల్లో రైతులకు వివిధ విధాలుగా అండగా నిలిచామని చెప్పారు.
ఆక్వా రంగం ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రిక అని పేర్కొన్న మంత్రి.. ఈ రంగాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేస్తామని అన్నారు. రైతులకు ఉత్పత్తి వ్యయం తగ్గించి, మార్కెట్ అవకాశాలను మెరుగుపరిచేలా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందని తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తదితరులు పాల్గొన్నారు.

