రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి..

  • ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ

వీరులపాడు, ఆంధ్రప్రభ: ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ సూచించారు. మంగళవారం వీరులపాడు మండలంలోని జుజ్జూరు, పొన్నవరం గ్రామాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

పొన్నవరంలోని సేంద్రియ వ్యవసాయ కేంద్రం, సొసైటీలో ఎరువుల విక్రయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఉర్దూ పాఠశాలకు ప్రహరీ నిర్మాణం

జుజ్జూరులోని ఉర్దూ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన ప్రహరీ నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అంగన్వాడీల్లో వసతులపై ఆరా

అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలపై కలెక్టర్‌ ఆరా తీశారు. పిల్లలకు పోషకాహారం, శుభ్రమైన తాగునీరు, ఆట స్థలం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. కేంద్రాల్లో తల్లులతో మాట్లాడి అందుతున్న సేవల నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అనంతరం ఎర్రుపాలెం నుంచి అమరావతికి వెళ్లే రైల్వే మార్గానికి సంబంధించిన భూములను రైతులతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ పాలపర్తి రవికుమార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ నాగరాజు, ఎంపీడీవో రూపావతి, ఎంఈవో పాల్‌ కెన్నడీ, పంచాయతీరాజ్‌ ఏఈ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.