రాజీ.. మధ్యవర్తిత్వమే ఉత్తమ పరిష్కారం

కేసుల పరిష్కారంలో సఖ్యతకు పెద్దపీట వేయాలి:

చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్

టేకుమట్ల, ఆంధ్రప్రభ : కేసుల పరిష్కారంలో రాజీ, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవచ్చని జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్ అన్నారు.

టేకుమట్ల మండలం సోమనపల్లి గ్రామంలోని కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ వ్యాన్ ద్వారా నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ సమస్యలు తలెత్తినప్పుడు పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవడం వల్ల సమయం, ధనం ఆదా కావడంతో పాటు ఇరుపక్షాల మధ్య సఖ్యత కొనసాగుతుందన్నారు.

ఇప్పటికే నమోదైన కేసుల్లోనూ చట్టపరమైన పరిధిలో రాజీ, మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించడం ఉత్తమమైన మార్గమని సూచించారు. ప్రజలు కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కే. అక్షయ, సూపరింటెండెంట్ రఘురామ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉన్న మీడియేషన్ సెంటర్ సేవలపై అవగాహన కల్పించారు. న్యాయపరమైన సమస్యలను సుదీర్ఘంగా కొనసాగించకుండా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.

అనంతరం అంకుశపురం, టేకుమట్ల, చిట్యాల గ్రామాల్లోనూ న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు న్యాయ సేవలు, మధ్యవర్తిత్వం, అందుబాటులో ఉన్న న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై అమూల్య, అంకుశపురం సర్పంచ్ తోట సునీతసాగర్, స్థానిక నాయకులు పోతనవేణి ఐలయ్య, బొల్లపెల్లి శ్రీనివాస్, థౌటం నవీన్, మారాపెల్లి మల్లేష్, ఎలుకటి రాజయ్య, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది దేవేందర్, కే. మహిత, రమ్య, అలేఖ్య, కే. వెంకటేష్, ఎమ్. రాజ్‌కుమార్, గౌతమి, మీడియేటర్ అంబాల ఆనందం, పారా లీగల్ వాలంటీర్లు అంబాల రమేష్, అరెపెల్లి తిరుపతి, బండారి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.