పంటలు కొనకుండా పండుగలేల?

పంటలు కొనకుండా పండుగలేల?

  • కళ్ళాల్లోనే మొక్కజొన్న ,ధాన్యం కుప్పలు
  • ఈ నెల 11 న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

పరకాల, ఆంధ్రప్రభ : కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, కొనుగోలు నిబంధనలు వలన రైతులు ఆరిగోస పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి అన్నారు. శనివారం రోజు పరకాల పట్టణంలో ముఖ్యకార్యకర్తల సమావేశం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరు చక్రపాణి మాట్లాడుతూ కొనుగొలు కేంద్రాల్లో సమస్యలతో రైతులు తలడిల్లుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో రైతు వారోత్సవాలు పేరుతో సభలు నిర్వహించడం సిగ్గుచేటుగా ఉందని ఆయన అన్నారు.

ఒకవైపు రైతులు కోతలు పూర్తయి పండించిన ధాన్యం కళ్ళల్లో కుప్పలుగా ఉండగా,రోజు కోక చోట అకాల వర్షం కురుస్తూ కంటికి కునుకు లేకుండా చేస్తుంటే రైతు కష్టాలు తీర్చాల్సిన ప్రభుత్వం వారోత్సవాలు పేరిట ఉత్సవాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,పంటల కొనుగోళ్లలో సర్కార్‌ ఆలస్యం రైతులకు శాపంగా మారిందన్నారు.

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన చోట కొనుగోళ్లు మొదలు పెట్టకపోవడం,మొదలుపెట్టిన చోట కొర్రీలు,కోతలతో జాప్యం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 20 రోజుల నుంచి నెలరోజుల పాటు కల్లాల్లోనే రైతులు పడిగాపులు కాస్తున్నారని,తామంతా రోడ్లపై అరిగోస పడుతుంటే..ఇదే సమయంలో పండుగలెలా చేస్తారు? అంటూ రైతులు మండిపడుతున్నారు.పంటలు కొనడం చేతగావడంలేదు గానీ.. పండుగలు చేయడానికి ఉత్సాహం చూపుతారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నింటా నష్టాలు చవిచూస్తున్న రైతులు కష్టాలు,కన్నీళ్లతోనే ఉత్సవాల్లో పాల్గొనలా?అంటూ ఆయన ప్రశ్నించారు. మొక్కజొన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కు పరిష్కారం చూపాలని, కాటాలు పూర్తి అయిన బస్తాలు తరలింపు కు అవసరమైన లారీలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 11న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బొచ్చు ఈశ్వర్, హేమంత్, కృష్ణ, మడికొండ ప్రశాంత్, సామల రాజు, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు