విధి బలీయం

మన సంస్కృతిలో తల్లిదండ్రులను, గురువులను దైవ సమానంగా భావించి గౌరవించి పూజించడం అలాగే వారు కూడా తమ పిల్లలను ప్రేమించడం, పెంచి పెద్ద చేయడం, విద్యా బుద్ధులు నేర్పి, వారిని బాధ్యతాయుత వ్యక్తులుగ తీర్చిదిద్దటం అనూచానంగా వస్తున్న బంధం. అయితే బలీయమైన విధి ఒక్కొక్కసారి మానవుల, మహనీయుల జీవితాలతో చెలగాటమాడుతుంది. ఎంత గొప్పవారైనా విధిచేతిలో ఆటబొమ్మలే! విధివశాత్తు కొన్ని ప్రత్యేక సందర్భాలలో తల్లిదండ్రులు, గురువులు, తమ సంతానం/ శిష్యులతో యుద్ధం చేయాల్సి రావడం- ధర్మ రక్షణకో, ఆడిన మాట నిలబెట్టుకోడానికో, వారిని చంపడమో లేదా వారి చేతిలో మరణించడమో జరుగుతుంది. కొన్ని సందర్భాలలో అలా చనిపోయిన వారు తిరిగి బ్రతకడం కూడా విధి విలాసమే. ఇలాంటి గాథలు మన పురాణేతిహాసాలలోనే కాక పాశ్చాత్య సాహిత్యంలో కూడా కన్పిస్తాయి. కొన్ని కథలను పరిశీలిద్దాం.
తొలుత వినాయకుని వృత్తాంతం గమనిద్దాం. గజాసురుని సంహారం తర్వాత పరమేశ్వరుడు కైలాసానికి బయలు దేరుతాడు. ఆయన రాక విని, సంతోషించిన పార్వతీ మాత అభ్యంగన స్నానం చేయడానికి వెడుతూ నలుగు పిండితో ఒక బాలుని చేసి, ప్రాణం పోసి, సింహద్వారం వద్ద కాపలాగా ఉంచి పోతుంది. నందిని ఎక్కివచ్చిన శివుడు లోపలికి పోబోవడం, అడ్డగించిన బాలుని శిరము త్రుంచడం, దు:ఖిస్తున్న పార్వతిని ఓదార్చి, గజాసురుని శిరస్సు ఆ బాలునికి అతికించి, ప్రాణం పోసి, గజాననుడు అనే పేరుతో ఆ బాలుని గణాధిపతిని చేయడం మనకు తెలిసిన కథే. తండ్రి చేతిలో మరణించి, పునరుజ్జీవితుడై, వినాయకుడు లోకవంద్యుడు కావడం విధి వైచిత్య్రమే.
ఇంకొకటి పరశురాముని కథ. జమ దగ్ని మహర్షి, రేణుకాదేవికి కలిగిన ఐదు మంది కొడుకులలో ఆఖరువాడు పరశురాముడు. ప్రాత: కాలాన నదీ స్నానం చేసి, బంకమట్టితో కుండను చేసి భర్త యాజ్ఞీకం కోసం నదీజలం తీసుక వచ్చే సమయంలో, నదిలో జలక్రీడలు ఆడుతున్న దేవతలను చూసి, క్షణకాలం మనసున వివశత్వం పొందిన రేణుకా దేవి, ఆశ్రమానికి పరధ్యానంతో నడచి వస్తుండగా, మట్టి కరిగి కుండలోని నీరు అంతా జారిపోతూ ఉండడం చూసి, దివ్యదృష్టితో రేణుక మోహ వివశురాలై ఉండడం గమనించి జమదగ్ని తన నల్గురు కొడుకులను పిలిచి వారిని తమ తల్లి తలను నరికి చంపమని ఆదేశిస్తాడు. మౌనం వహించిన ఆ కొడుకులను శపిస్తాడు. నిత్యమూ ఆశ్రమంలో జరిగే హూమహవనాల కోసం సమిధలు తేవడానికి అడవికి వెళ్ళిన పరశురాముడు తిరిగి వచ్చాక, తండ్రి జమదగ్ని ఆదేశించగానే ఏమీ ఆలోచించక తన పరశువు(గొడ్డలి)తో తన తల్లి రేణుకా దేవి తలను ఖండిస్తాడు. పితృనాజ్ఞ పాటించినందుకు సంతసించి పరశురాముడిని వరం కోరుకోమంటాడు జమదగ్ని. తన తల్లిని బ్రతికించమని, సోదరులను శాపవిముక్తులను చేయమని పరశురాముడు కోరుకోవడం, జమదగ్ని రేణుకా దేవిని బ్రతికించడము, నల్గురు కొడుకులకు శాప విమోచనం కావించడం జరుగుతుంది. కొడుకు చేతిలో తల్లి మరణించడం, భర్త తపశ్శక్తి వలన తిరిగి జీవించడం విధి లీల. నరకాసుర వృత్తాంతం కూడా ఇటువంటిదే. తల్లి చేతిలో కొడుకు చనిపోవటం కూడా విధి ఆడించిన వింత నాటకమే. ఇలాంటి కథలు పాశ్చాత్య సాహిత్యంలో, పురాణాలలో, చరిత్రలోనూ కన్పిస్తాయి. షేక్స్పియర్‌ వ్రాసిన ‘హావ్లొట్‌’ నాటకంలో కథానాయకుడు విధిని గురించి ఇలా అంటాడు. ఒక పిచ్చుక పైనుండి క్రింద పడిపోవడం వెనుక కూడా విధి హస్తం ఉంటుంది” అని ఆ వాక్యానికి అర్థం. ఈ వాక్యం ‘శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’ అనే నానుడిని గుర్తు చేస్తుంది.
ఇటువంటి బాధాతప్త గాథలు మనకు అన్ని భాషల ప్రపంచ సాహిత్యంలో అనేకం కన్పిస్తాయి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ”అమర ఖయామ్‌” కావ్యంలో ‘ప్రపంచము’ అనే శీర్షిక క్రింద ఉన్న ఒక పద్యంలోని ఆఖరు పాదం ”కట్టిడి కాలమా! యముని గాలమ ! నీకడు పెంత పెద్దదే !” విధి చాలా బలీయమనే సత్యాన్ని పదే పదే మనకు గుర్తు చేస్తుంది.

  • గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *