రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
- ఉప్పునుంతలలో కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన
- వరి కొనుగోలు కేంద్రాలు, ఉపాధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల
- నిర్మాణాలపై హేమంత్ కేశవ్ పాటిల్ సమీక్ష
ఉప్పునుంతల, ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. శనివారం అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ఉప్పునుంతల మండలంలోని మామిళ్లపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. ముందుగా మామిళ్లపల్లి గ్రామంలోని చెరువు కట్టపై కొనసాగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను తనిఖీ చేసి, పనుల నాణ్యత, కార్మికుల హాజరు, వేతనాల చెల్లింపులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచేలా పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణాల పురోగతి, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని నిర్ణీత గడువులో నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండరాదని స్పష్టం చేశారు. గ్రామంలో కొనసాగుతున్న జనాభా గణన ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ప్రతి కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.

జూన్ 1వ తేదీలోగా జిల్లాలో తొలి విడత జనగణన పూర్తి చేయాలని ఆదేశించారు. తదుపరి మామిళ్లపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలు, తూకం, చెల్లింపుల విధానంపై వివరాలు తెలుసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించారు. వరి కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు, నిల్వ ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణను పరిశీలించిన కలెక్టర్, రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర పొందేలా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు అవసరమైన లారీలను అందుబాటులో ఉంచాలని సూచించారు. అంతకుముందు మామిళ్లపల్లి గ్రామంలోని పురాతన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని సందర్శించిన కలెక్టర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చారిత్రక విశిష్టత, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆలయ అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్‌లు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

