ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిఈవోకు వినతి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్ద జట్రం ప్రాథమిక పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నారాయణపేట డిఈవో గోవింద్ రాజుకు పెద్దజట్రంసర్పంచ్ వాకిటి వెంకటేష్ ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రంసమర్పించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించి విద్యాభివృద్ధికి సహకరించాలనివిజ్ఞప్తిచేశారు. పెద్దజట్రం ప్రాథమిక పాఠశాలలో 192 మంది విద్యార్థులకు గాను ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారని విద్య హక్కు చట్టం ప్రకారం మరో ముగ్గురు ఉపాధ్యాయులను నియమించాలని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కొరత తీర్చాలని కోరుతున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని వెంటనే ఉపాధ్యాయులను నియమించాలనికోరారు. ఉపాధ్యాయులను నియమిస్తే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామనిఅన్నారు. అందుకు స్పందించిన డీఈవో గోవిందరాజు ఎంఈవోతో మాట్లాడి ఉపాధ్యాయుల సమస్య పరిష్కరించాలని సూచించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకుకృషిచేస్తాననిహామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్, మాజీ ఎంపీటీసీ కిరణ్ కుమార్, వార్డు సభ్యుడు సోమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
