గన్నీ సంచులు లేవు..లారీలు రావు

గన్నీ సంచులు లేవు..లారీలు రావు
- ప్రైవేటు దుకాణాల్లో కొంటున్న రైతులు
- అన్నదాతలకు అదనపు భారం
- లారీలు లేక ఆలస్యమవుతున్న కొనుగోళ్లు
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొక్కజొన్న,వరి ధాన్యం కేంద్రాల్లో గన్ని సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు రోజులు గడుస్తున్నా.. గన్నీ సంచుల కొరత,రవాణా సౌకర్యాల లేమి,ధాన్యం ఆరబోయడానికి ప్యాడీ క్లీనర్ లు లేక రైతుల పాలిట శాపంగా మారాయి.
దీంతో కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయి.పిఎసిఎస్ కేంద్రంలో నిల్వలు ఎక్కువగా ఉండడంతో అధికారులు కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు.ప్రభుత్వమే గన్నీ బ్యాగులు సరఫరా చేయాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.గన్నీ సంచులు లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.పంటలు ఆరబోసి కొనుగోళ్ల కోసం వేచి చూడలేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
రవాణాకు లారీల కొరత
గన్నీ బ్యాగుల సమస్య ఒకవైపు, కొనుగోలు చేసిన పంటలను గోదాంకు తరలించడానికి మరో ప్రధాన సమస్యగా మారింది.కొనుగోలు కేంద్రాల్లో పంటలు రోజుల తరబడి కేంద్రాల వద్ద కాపలా కాయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణ చర్యలకు రైతుల డిమాండ్
ఆకాశం మేఘావృతమై వర్షం సూచనలు కనిపిస్తుండడంతో పంటలు తడిసిపోక ముందే అధికారులు స్పందించాలని రైతులకు కోరుతున్నారు.యుద్ధ ప్రాతిపదికన గన్నీ సంచుల సరఫరా చేయడంతో పాటు రవాణాకు సరిపడా లారీలను కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.రైతులపై పడుతున్న అదనపు భారాన్ని గుర్తించి అధికారులు జోక్యం చేసుకొని కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని మండల రైతాంగం విజ్ఞప్తి చేస్తుంది.
గన్నీ సంచులు లేక వారం రోజులు
రైతు ఎండి మైనుద్దీన్
నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన ఈ రైతు ఎండి మైనుద్దీన్ దాన్యం పంటలను 20రోజుల క్రితం తీసుకువచ్చాడు.మాయిచ్చర్ వచ్చినా గాని కాంటాలు జరగడం లేదని దీనికి తోడు రైతులకు గన్నీల కొరత కారణంగా బయట మార్కెట్లో ఒక్కో గన్ని సంచికి
రూ.35 చొప్పున వెచ్చించి సంచులను కొనాల్సి వస్తుంది.
