ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్
- ప్రతి వినతికి సత్వర పరిష్కారమే లక్ష్యం
- చంద్రబాబు ఆదేశాలతో ప్రజలకు మరింత చేరువుగా కూటమి ప్రభుత్వం
- పింఛన్లు, ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం, ప్రభుత్వ పథకాలపై వినతుల స్వీకరణ
- ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం
- ప్రజాదర్బార్‌ను సద్వినియోగం చేసుకోవాలి
- పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్దా వెంకన్న
భవానిపురం, ఆంధ్రప్రభ: ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేసి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బుద్దా వెంకన్న అన్నారు. శుక్రవారం పశ్చిమ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 40వ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సంబంధిత సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రతి వినతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, స్థానిక మౌలిక వసతులు, ఇతర ప్రజా సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సేవలు అందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా నేరుగా స్వీకరించి పరిష్కారం చూపే దిశగా ప్రజా దర్బార్ కార్యక్రమం సమర్థవంతంగా కొనసాగుతోందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ప్రజా దర్బార్‌ను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వం స్పందిస్తుందని, ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్, నియోజకవర్గ పరిశీలకుడు మల్లెపు ఈశ్వర్, 40వ డివిజన్ అధ్యక్షుడు చిన్న సుబ్బయ్య, మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు, చీపుళ్ల వెంకటేశ్వరరావు, మైలవరపు వీరబాబుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

