ఆగి ఉన్న వ్యానును ఢీకొన్న బైకు

తండ్రి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు

ముత్తారం, ఆంధ్రప్రభ : ముత్తారం మండలం కేశనపల్లి గ్రామంలో ఆగి ఉన్న వ్యానును ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో తండ్రి మృతి చెందగా, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశనపల్లి గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే డీసీఎం వ్యాను నిలిపి ఉంది. ఈ క్రమంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కూలీ పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై జాడి రాజేందర్ (55), అతని కుమారుడు శేఖర్ గోదావరిఖని వైపు వెళ్తున్నారు.

కేశనపల్లి వద్దకు చేరుకోగానే ఆగి ఉన్న వ్యానును వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాజేందర్ అక్కడికక్కడే మృతి చెందగా, అతని కుమారుడు శేఖర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న ముత్తారం ఎస్‌ఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన శేఖర్‌ను మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.