Hospitals | డీఎంఈగా డా.విష్ణువర్ధన్ నియామకం
Hospitals | డీఎంఈగా డా.విష్ణువర్ధన్ నియామకం
Hospitals | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో భారీ స్థాయిలో బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. పలు కీలక పోస్టులకు కొత్త అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్య, ఆసుపత్రుల పరిపాలన వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది.
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)గా డా.అత్తలూరి విష్ణువర్ధన్‌ను ప్రభుత్వం నియమించింది. పదోన్నతి పొందిన 15మంది ఏడీఎంఈలకు కూడా పోస్టింగ్‌లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా నలుగురు కొత్త మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్స్, తొమ్మిది మంది సూపరింటెండెంట్ల నియామకాలు చేపట్టింది.
విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డా.రఘునందన్‌ను నియమించగా, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా డా. ఉషాకిరణ్ బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే విశాఖలోని విమ్స్ డైరెక్టర్‌గా డా.మన్మథరావును నియమించింది ప్రభుత్వం. ఈ మార్పులతో ప్రభుత్వ వైద్య సేవలు, మెడికల్ విద్యా వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారులు భావిస్తున్నారు.
