కాంట్రాక్టర్లను వేధించొద్దు : కోమటిరెడ్డి

హైదరాబాద్, ఆంధ్రప్రభ : రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్న నిజాయితీ గల కాంట్రాక్టర్లను మైనింగ్ అనుమతుల పేరుతో వేధించవద్దని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గనుల శాఖ అధికారులను ఆదేశించారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారిపై మాత్రం చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

శుక్రవారం సచివాలయంలో గనులు, భూగర్భశాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామితో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో రోడ్ల కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి చర్చించారు. ఈ సమావేశానికి మైనింగ్ కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు హాజరై ఇసుక, మట్టి, మెటల్ వంటి నిర్మాణ సామగ్రికి అనుమతులు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు.

రోడ్ల నిర్మాణానికి ఇసుక, మట్టి, మెటల్ వంటి సామగ్రి అత్యవసరమని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఒప్పంద నిబంధనల ప్రకారం పనులు చేస్తున్న చిన్న కాంట్రాక్టర్లపై పదింతల జరిమానాలు విధించడం సమంజసం కాదన్నారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారిని వదిలిపెట్టి, నిజాయితీగా పనిచేస్తున్న కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవడం సరికాదని అధికారులకు సూచించారు.

కాంట్రాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై కూడా మంత్రి ప్రస్తావించారు. ఈ ఘటనకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు.

రూ.5 కోట్ల విలువైన అంశంపై రూ.54 కోట్ల జరిమానా విధించడం అత్యంత అన్యాయమని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లు ఒప్పందాల ప్రకారం ప్రభుత్వానికి చెల్లింపులు చేస్తున్నప్పటికీ ఇలాంటి భారీ జరిమానాలు విధించడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) కింద నాణ్యమైన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. 2028 ఆగస్టు నాటికి ఈ రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

మంత్రి కోమటిరెడ్డి ప్రస్తావించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆర్‌అండ్‌బీ శాఖ చీఫ్ ఇంజనీర్ బి.వి. రావు, మైనింగ్ కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.