మండలంలో అరుదైన పురాతన నాగులమ్మ శిలలు
బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామంలో అరుదైన పురాతన శిలలు వెలుగులోకి వచ్చాయి. గ్రామంలోని నాగులచెరువు కట్ట వద్ద సుమారు 10 నాగులమ్మ ఆకృతులు చెక్కబడిన శిలలు బయటపడటం స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. ఏరువాక పున్నమి సందర్భంగా చెరువులో ఇప్పటికే ఉన్న రెండు నాగులమ్మ విగ్రహాలకు పూజలు నిర్వహించేందుకు గ్రామస్థులు శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మట్టిలో పూడిపోయి ఉన్న మరికొన్ని శిలలు వెలికి వచ్చాయి.
ఈ శిలలపై నాగులమ్మ ఆకృతులు స్పష్టంగా కనిపించడంతో గ్రామస్తులు భక్తి భావంతో పూజలు నిర్వహించారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం, ఈ శిలలు చాలా కాలం నాటి పురాతన దేవతారాధనకు సంబంధించినవిగా భావిస్తున్నారు. ఈ శిలలను పరిరక్షించి, అభివృద్ధి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయంపై పురావస్తు శాఖ అధికారులు స్పందించి, పరిశీలనలు జరిపితే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
