ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఘనంగా ర్యాలీ

సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలతో ఆకట్టుకున్న ఆదివాసీలు

ఏటూరునాగారం, ఆంధ్రప్రభ: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆదివారం ఆదివాసీ ప్రజలు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. వై జంక్షన్‌లోని కొమురం భీమ్‌ జంక్షన్‌ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. సంప్రదాయ దుస్తులు ధరించిన ఆదివాసీలు నృత్యాలు చేస్తూ, సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో ప్రధాన రహదారి సందడిగా మారింది.

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించేలా ర్యాలీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో ఆదివాసీ ప్రజలు పాల్గొని తమ ఐక్యతను చాటిచెప్పారు. ఆదివాసీ హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు సాగాలనే సందేశాన్ని ర్యాలీ ద్వారా వినిపించారు.