ADB | కౌలు రైతు కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నం – భ‌ర్త మృతి, భార్య ప‌రిస్థితి విష‌మం

ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ బ్యూరో : పండించిన పంట దిగుబడి చేతికి రాక, పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేక ఓ రైతు కుటుంబం బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగోండ మండ‌లం వ‌డూర్ గ్రామానికి చెందిన‌ రైతు ఇదాపు పోశెట్టి (60), భార్య ఇంద్ర (54) బుధ‌వారం రాత్రి పురుగుల మందు తాగారు. అస్వ‌స్థ‌త‌కు గురైన వారిద్ద‌రిని చుట్టుప‌క్క‌ల వారు చూసి ఆస్ప‌త్రికి త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంత‌లో రైతు ఇదాపు పోశెట్టి ఇంట్లోనే మృతి చెంద‌గా, ఇంద్ర‌ను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

దిగుబడి రాక.. అప్పులు తీర్చే దారి లేక..
నేరేడిగోండ మండలం వడూర్ గ్రామానికి చెందిన ఇదాపు పోశెట్టి తనకున్న రెండు ఎకరాల మెట్ట భూమిలో పత్తి పంట సాగు చేసి మరో 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. పత్తి, సోయాబీన్ పంట దిగుబడి చేతికి రాక నష్టాల పాలయ్యాడు. పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల దగ్గర చేసిన అప్పులు తడసి మోపెడు కావడంతో బతుకు పై ఆశలు తెంచుకొని బుధవారం రాత్రి భార్యాభర్తలిద్దరూ పురుగుల మందు తాగారు. పోశెట్టి ఇంట్లోనే ప్రాణాలు కోల్పోగా, చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భార్య ఇంద్రను గ్రామస్తులు ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. చికిత్స పొందుతున్న ఇంద్ర పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

వడూరు గ్రామంలో విషాదం..!
నీరడిగొండ మండలం వడూరు గ్రామంలో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన ఘటన గురువారం విషాదం నింపింది. ఈ ఏడు పంటలు నష్టపోయి తమ బతుకులు దుర్భరంగా మారాయని రైతులు వాపోయారు. రైతు పోశెట్టి పంట కోసం లక్షల్లో అప్పులు చేసి తీర్చే దారి లేక పురుగుల మందు తాగారని పేర్కొన్నారు. పోశెట్టి పేరిట బ్యాంకులో బకాయి ఉన్న రుణమాఫీ అమలుకు నోచుకోకపోవడం, మరోవైపు రైతు బంధు సాయం కూడా అందకపోవడం ఇబ్బందులకు గురి చేసిందని గ్రామస్తులు తెలిపారు. అప్పు సొప్పు చేసి ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి చివరకు పురుగుల మందు తాగి కుటుంబం అఘాయిత్యానికి పాల్పడినట్టు రైతులు కంటతడి పెట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. ప్రభుత్వం అప్పుల పాలైన కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *