రాహుల్ గాంధీ సేవలు యువతకు ఆదర్శం..
మామడ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సేవలు యువతకు ఆదర్శప్రాయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన అధ్యక్షుడు పి. సమరసింహారెడ్డి అన్నారు.
రాహుల్ గాంధీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నిర్మల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మామడ మండల పరిధిలోని పరిమండల్ గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సేవా దృక్పథంతో చిన్నారుల విద్యాభివృద్ధికి తోడ్పాటునందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను పంపిణీ చేసి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పి. సమరసింహారెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న రాహుల్ గాంధీ సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజ సేవతో పాటు విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ అర్షదుద్దీన్, టౌన్ అధ్యక్షుడు సాయి ప్రతాప్ నాయుడు, యూత్ కాంగ్రెస్ నాయకులు నవీద్, డానిష్, ముసేబ్‌తో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
