తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
రోడ్డుపై బైఠాయించి ఆందోళన
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని మోపిడి గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం కళ్యాణదుర్గం – ఉరవకొండ రోడ్డుపై మహిళ లు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తాగునీటి సమస్య పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఖాళీ బిందెలతో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. గత 20 రోజుల నుండి తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసిన ఏమాత్రం పట్టించుకోవడంలేదని, నీటి సమస్య పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ అభివృద్ధి అధికారి రమణ కుమార్ మాట్లాడుతూ.. రెండు రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.
