చదువే జీవిత విజయానికి పునాది: కౌన్సిలర్ రజిత రాజు
మంథని, ఆంధ్రప్రభ: చదువు మనకు తోడుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని మంథని మున్సిపల్ కౌన్సిలర్ లైశెట్టి రజిత రాజు అన్నారు. శనివారం మంథని పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలురు)లో ఆరవ తరగతి విద్యార్థులకు అవసరమైన బోర్డును కౌన్సిలర్ లైశెట్టి రజిత రాజు అందజేశారు. పెద్దపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ సమన్వయ అధికారి, ప్రిన్సిపల్ ఉటూరి శ్రీనాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రజిత రాజు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. గురువులు చెప్పే విషయాలను శ్రద్ధగా పాటిస్తూ పాఠశాలకు, తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
చదువు విలువ తనకు తెలుసని, విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలను ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని గురుకులాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
బోర్డును అందజేసినందుకు విద్యార్థులు కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ ఉటూరి శ్రీనాథ్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ రజిత రాజు దంపతులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రిన్సిపల్ నవీన్, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు వనిత, లింగయ్య, రవీందర్, విద్యార్థులు పాల్గొన్నారు.
