చిన్నారుల ఆరోగ్య రక్షణకు నులిపురుగుల నివారణమాత్రలు

ఊట్కూర్, జులై 13 (ఆంధ్రప్రభ): ఒకటి నుంచి 13 ఏళ్ల వయస్సు గల చిన్నారులందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని ఊట్కూర్ మండల విద్యాధికారి మాధవి, వైద్యాధికారి డాక్టర్ సంతోషి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ పిలుపునిచ్చారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర బాలికల ఉన్నత పాఠశాలల్లో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి వేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చిన్నారుల్లో నులిపురుగుల సమస్య వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అందుకే ప్రభుత్వం ప్రతి ఏడాది జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందనిఅన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా ఈ మాత్రలు వేయించి ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు కూడా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ మాత్రలు అందజేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యవంతమైన బాల్యం దేశాభివృద్ధికి పునాదని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మణిమాల, ఏఎన్ఎంలు గోవిందమ్మ, కవిత ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.