Ditva cyclone | రెడ్ అలెర్ట్..
Ditva cyclone | రెడ్ అలెర్ట్..
Ditva cyclone, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కొనసాగుతుంది. ఇది ఏపీ (AP) వైపుకు దూసుకొస్తోంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాలకు ముప్పు పొంచి ఉందని, ఆది, సోమవారాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థలు ప్రకటించాయి. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ దిత్వా తుఫాన్ ప్రభావంతో శనివారం రాత్రి నుంచే ఈ జిల్లాల్లో వర్షాలు, ఈదురు గాలులు ప్రారంభం అయ్యాయి. ఈ వర్షాలు మరింత పెరగనున్నాయని.. తీర ప్రాంతాల్లో 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరింది.
దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారి ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు, (Tamilnadu) పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియచేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున తీరం దిశగా అలలు ఎగిసిపడుతున్నాయి. సోమవారం వరకూ మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. కృష్ణపట్నం పోర్టులో మూడు, మిగిలిన ఓడరేవుల్లో రెండో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు. ఆదివారం సాయంత్రం వరకు తుఫాన్ తీవ్రత కొనసాగుతుందని.. ఆతర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు.
