పారదర్శక ఓటర్ల జాబితా తయారే లక్ష్యం – కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలో ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారే ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
గురువారం తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామంలోని ఎన్టీఆర్ నగర్లో విధులు నిర్వహిస్తున్న బూత్ లెవల్ అధికారుల (బీఎల్వోలు) పనితీరును కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఎన్యుమరేషన్, ఓటర్ల ధృవీకరణ, మ్యాపింగ్, ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియల పురోగతిని ఆమె క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ స్వయంగా ఇంటింటికీ వెళ్లి ఓటర్లతో మాట్లాడారు. ప్రతి అర్హ ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారం అందిందా అని తెలుసుకుని, ఫారాలను పూర్తిగా నింపి త్వరగా బీఎల్వోలకు అందజేయాలని సూచించారు. ముఖ్యంగా 2004 తర్వాత జన్మించిన యువత తమ వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేయాలని అవగాహన కల్పించారు.
ఇప్పటివరకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 98.6 శాతం పూర్తయిందని, మిగిలిన పనిని త్వరగా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ను ఎన్నికల కమిషన్ గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ప్రతి ఓటరును సరైన పోలింగ్ కేంద్రానికి మ్యాప్ చేయడం అత్యంత కీలకమని, మ్యాపింగ్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని బీఎల్వోలను ఆదేశించారు. సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మన్నే సూర్యారావు, తహసీల్దార్ సునీల్ కుమార్, బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
