ఘనంగా డిజిటల్ వర్చువల్ మహానాడు రెండో రోజు వేడుకలు

ఘనంగా డిజిటల్ వర్చువల్ మహానాడు రెండో రోజు వేడుకలు

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీరస్తు కన్వెన్షన్‌లో వైభవంగా నిర్వహణ
ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ
ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు… భారీ కేక్ కట్ చేసిన నేతలు
హాజరైన తెలుగుదేశం శ్రేణులు, మహిళలు, యువత… తరలివచ్చిన తెలంగాణ టీడీపీ కార్యకర్తలు

తిరువూరు, ఆంధ్రప్రభ రూరల్ : తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ఆశయాల సాధనే ధ్యేయంగా తిరువూరు నియోజకవర్గంలో మహానాడు సంబరాలు అంబరాన్నంటాయి. తిరువూరు పట్టణంలోని శ్రీరస్తు కన్వెన్షన్ హాల్‌లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డిజిటల్ వర్చువల్ మహానాడు రెండో రోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా వర్చువల్ మహానాడు ప్రసారాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత ఉత్సాహంగా వీక్షించారు.

కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ముఖ్య అతిథిగా హాజరై శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆమెకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సంక్షేమ పథకాలు, సూపర్ సిక్స్ హామీలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు.

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహానీయుడని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు కూడా హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీరస్తు కన్వెన్షన్ ప్రాంగణం జై ఎన్టీఆర్, జై చంద్రబాబు నినాదాలతో మార్మోగింది.

Leave a Reply