ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కారానికి మే 20న ధర్నా

గుండాల/ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మే 20న గుండాల మండల కేంద్రంలో నిర్వహించే వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ధర్నాను జయప్రదం చేయాలని సీపీఎం మండల అధ్యక్షుడు తోలేం గోపి, వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం నాయకుడు ఊకే వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
శనివారం ఉపాధి హామీ కూలీలను కలిసి వారు మాట్లాడుతూ.. తెలంగాణ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన, నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన పలు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వీబీజీ విధానాన్ని రద్దు చేయాలని, ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని కోరారు. రోజుకు రెండుసార్లు ఫోటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
కూలీలకు కోలతలతో సంబంధం లేకుండా రోజువారీ రూ.500 వేతనం ఇవ్వాలని, పని ప్రదేశాల్లో టెంట్, తాగునీటి సౌకర్యం, మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి జాబ్ కార్డుకు గడ్డపార, పార వంటి పనిముట్లు అందించాలని, కొత్త జాబ్ కార్డులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామీణ వ్యవసాయ పనులకు కూడా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, ఇంటి స్థలం లేనివారు, గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి నిర్వహించే ధర్నాలో మండల వ్యాప్తంగా కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పక్కనపెట్టి, గత కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడంలోనే నిమగ్నమైందని సీపీఎం నాయకులు విమర్శించారు.
