పార్టీ కోసం నిలబడే నాయకులు కావాలి

పార్టీ కోసం నిలబడే నాయకులు కావాలి

– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ధర్మపురి, ఆంధ్రప్రభ :
కార్యకర్తల కోసం, పార్టీ కోసం నిలబడి పోరాడే నాయకులే బీఆర్ఎస్ పార్టీకి కావాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అధికారం కోసమే వచ్చే నాయకులకు పార్టీలో స్థానం ఉండదని స్పష్టం చేశారు. సోమవారం ఎస్‌హెచ్ గార్డెన్‌లో ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు విస్తృత స్థాయి సమావేశం మరియు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ కోసం పని చేసే నాయకులను గుర్తించి ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని, వాటికి భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ లీగల్ సెల్‌తో పాటు తాను కూడా అండగా ఉంటానని చెప్పారు. అధికారులు ప్రజల కోసం పనిచేయాలని, కానీ ధర్మపురి నియోజకవర్గంలో కొందరు పోలీసులు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు.

రాబోయే రెండున్నర సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికారం కోసం పార్టీలు మారే నాయకులకు స్థానం ఉండదని, పార్టీ కోసం కష్టపడే వారికి మాత్రమే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరైనందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఇదే సమావేశంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచించిందని, వరి ధాన్యం కొనుగోళ్లలో కోతలు, జాప్యం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి మూల విజయ రెడ్డి, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఓరగంటి రమణారావు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మాధవరావు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ అయ్యోరి రాజేష్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ సంగి సత్తెమ్మ, పట్టణ కన్వీనర్ బండారి రంజిత్, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply