Airbus H160 | సీఎం కోసం కొత్త‌ హెలికాప్టర్‌.. !?

Airbus H160 | సీఎం కోసం కొత్త‌ హెలికాప్టర్‌.. !?

  • ఖ‌రీదైన హెలికాఫర్ట్ రెంటు తీసుకునే యోచ‌న‌లో రేవంత్ స‌ర్కార్?
  • అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఎయిర్‌బస్‌ హెచ్‌-160

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో అత్యాధునిక హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న ఆగస్టా-169 హెలికాప్టర్‌కు అదనంగా, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఎయిర్‌బస్ హెచ్-160 (Airbus H160) హెలికాప్టర్‌ను రెంటుకు తీసుకోవాలని అధికారులు ప్రాథమికంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేసేందుకు త్వరలోనే ప్రత్యేక కమిటీని నియమించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ హెలికాప్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేకంగా తీసుకుంటారా? లేక మంత్రులు, ఉన్నతాధికారులు కూడా వినియోగిస్తారా? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం ఉన్న హెలికాప్టర్ పరిస్థితి ఏంటి?

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం 8 సీట్ల సామర్థ్యం కలిగిన ఆగస్టా-169 హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుని వినియోగిస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు తరచూ ఈ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తుండటంతో అందుబాటు సమస్యలు ఎదురవుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న చర్చల ప్రకారం, ప్రస్తుతం ఉన్న హెలికాప్టర్‌ను దాదాపు “షేర్ ఆటో” మాదిరిగా పలువురు వాడాల్సి వస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరో హెలికాప్టర్ అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎయిర్‌బస్ హెచ్-160 ప్రత్యేకతలు…

ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక మధ్యతరహా ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్లలో ఎయిర్‌బస్ హెచ్-160 (Airbus H160) ప్రత్యేక గుర్తింపు పొందింది. అత్యాధునిక సాంకేతికత, అధిక భద్రతా ప్రమాణాలు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కలగలిపిన ఈ హెలికాప్టర్ 6, 8 లేదా 12 సీట్ల సామర్థ్యంతో అందుబాటులో ఉంటుంది. రెండు శక్తివంతమైన ఇంజిన్లతో పనిచేసే ఇది గంటకు గరిష్ఠంగా 255 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

ఒకేసారి సుమారు నాలుగున్నర గంటల పాటు నిరంతరాయంగా ఎగిరే సామర్థ్యం దీనికి ఉంది. అత్యాధునిక ఆటోపైలట్‌, డిజిటల్ నావిగేషన్ వ్యవస్థలు కలిగి ఉండటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుంది. అంతేకాకుండా, ఇంజిన్ల నుంచి వచ్చే శబ్దాన్ని గణనీయంగా తగ్గించే ప్రత్యేక డిజైన్ కారణంగా ప్రయాణికులకు మరింత ప్రశాంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. అందుకే ఈ హెలికాప్టర్‌ను ప్రపంచంలోని పలు ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, అత్యవసర సేవల విభాగాలు వినియోగిస్తున్నాయి.

ఖర్చు ఎంత?

ప్రస్తుతం ప్రభుత్వం వినియోగిస్తున్న ఆగస్టా-169 హెలికాప్టర్‌కు నెలకు సుమారు రూ.2 కోట్ల వరకు అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. అయితే కొత్తగా ప్రతిపాదిస్తున్న ఎయిర్‌బస్ హెచ్-160 హెలికాప్టర్‌కు నెలకు రూ.5 కోట్ల వరకు అద్దె భారం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాపై అదనపు భారం ఎంత పడుతుంది? ఈ వ్యయం అవసరమా? అనే అంశాలపై రాజకీయంగా కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కొత్త హెలికాప్టర్ అద్దెకు తీసుకుంటే ప్రస్తుతం వినియోగిస్తున్న ఆగస్టా-169ను కొనసాగిస్తారా? లేక దానిని తప్పిస్తారా? అన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. రెండు హెలికాప్టర్లను సమాంతరంగా వినియోగించే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Leave a Reply