తెలంగాణ రైతాంగానికి మరో మైలురాయి
తెలంగాణ రైతాంగానికి మరో మైలురాయి
రేపు కోహెడ నూతన ఫ్రూట్ మార్కెట్ యార్డ్ ప్రారంభం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: తెలంగాణ రైతాంగానికి మరో కీలక మైలురాయి అందుబాటులోకి రానుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన నూతన ఫ్రూట్ మార్కెట్ యార్డ్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జూన్ 6వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక మార్కెట్ యార్డ్ ప్రారంభం కానుంది. పండ్ల తోటల రైతుల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి వేలాది మంది రైతులు హాజరుకానున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
రైతులకు రవాణా ఇబ్బందులు లేకుండా వివిధ గ్రామాల వారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులు శనివారం మధ్యాహ్నం 1 గంటకు నిర్ణీత గ్రామాల నుంచి కోహెడకు బయలుదేరనున్నాయి.
చౌటుప్పల్ మండల రైతుల కోసం మొత్తం 7 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. తంగడపల్లి నుంచి చౌటుప్పల్ మీదుగా ఒక బస్సు, లింగోజీగూడెం నుంచి కట్రేవ్, అంకిరెడ్డిగూడెం, తాళ్ల సింగారం మీదుగా మరో బస్సు నడవనుంది.
అలాగే పంతంగి నుంచి గుండ్లబావి, ఆరేగూడెం మీదుగా, జైకేసారం నుంచి నెలపట్ల, స్వాముల వారి లింగోటం మీదుగా బస్సులు ఏర్పాటు చేశారు. లక్కారం నుంచి ఎల్లగిరి, తూప్రాన్‌పేట్, ధర్మోజీగూడెం, ఖైతాపూర్ మీదుగా మరో బస్సు నడుస్తుంది.
పీపల్‌పహాడ్ నుంచి దేవలమ్మ నగరం, అల్లపూర్, కొయ్యలగూడెం, మల్కాపురం మీదుగా ఒక బస్సు, చిన్నకొండూరు నుంచి పెద్దకొండూరు, మసీదుగూడెం, మందోళ్లగూడెం మీదుగా మరో బస్సు కోహెడకు బయలుదేరనుంది.
రైతు సంక్షేమానికి మైలురాయిగా నిలిచే ఈ కార్యక్రమానికి రైతులందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు పిలుపునిచ్చారు. మధ్యాహ్నం 1 గంటకే తమ గ్రామాల్లో సిద్ధంగా ఉండే ప్రత్యేక బస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
