Boat Accident | చంద్రబాబు సర్కార్‌పై జగన్ ఫైర్

Boat Accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బోటు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం, అధికారులు ఎందుకు స్పందించలేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. విశాఖపట్నంలోని జబ్బర్ తోటలో బాధిత మత్స్యకార కుటుంబాలను మంగళవారం ఆయన పరామర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మత్స్యకార కుటుంబాలు తమకు ఎదురైన పరిస్థితులను జగన్‌కు వివరించాయి.

అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నెల 1న ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారని, తీరం నుంచి కేవలం పది మైళ్ల దూరంలోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. జులై 4న చిన్నా అనే మత్స్యకారుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నట్లు చెప్పాడని, ఆ తర్వాత కొద్దిసేపటికే బోటు ప్రమాదానికి గురైందని వివరించారు.

ప్రమాదం జరిగిన విషయాన్ని అధికారులకు వెంటనే సమాచారం ఇచ్చినప్పటికీ స్పందన లేదని జగన్ ఆరోపించారు. రాత్రి 10.30 గంటల సమయంలో కలెక్టర్, మెరైన్ సీఐకి సందేశాలు పంపారని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించి ఉంటే గంటల వ్యవధిలోనే మత్స్యకారుల ఆచూకీ లభించేదని అన్నారు.

“కోస్ట్ గార్డ్ వెంటనే వచ్చి ఉంటే ఐదుగురైనా బతికేవారు” అని జగన్ వ్యాఖ్యానించారు. ఈ నెల 5న చైనా బోటు సిబ్బంది చిన్నాను కాపాడారని తెలిపారు. ప్రమాద ఘటనలో తప్పు జరిగింది కాబట్టే ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిందని, అయితే ఆ కమిటీ నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. “చంద్రబాబు ప్రభుత్వానికి మానవత్వం ఉందా?” అని ప్రశ్నించారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఒక్క అధికారి కూడా బాధిత కుటుంబాల వద్దకు రాలేదని జగన్ విమర్శించారు. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు ఎవరూ స్పందించలేదని, మత్స్యశాఖ మంత్రి కూడా బాధితులను పరామర్శించలేదని ఆరోపించారు. బాధిత కుటుంబాల వద్దకు మంత్రులను పంపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని నిలదీశారు.

ప్రభుత్వ యంత్రాంగం రాత్రికి రాత్రే స్పందించి సహాయక చర్యలు చేపట్టి ఉంటే మత్స్యకారుల ప్రాణాలు దక్కేవని జగన్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రకటించిన పరిహారం సరిపోదని అన్నారు. మృతులు, బాధిత మత్స్యకార కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏడుగురు మత్స్యకారుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.