‘జగనన్న 2.0’ యాప్‌తో ప్రజలకు మరింత చేరువ
- కార్యకర్తలు, ప్రజలను ఒకే వేదికపైకి తెచ్చేలా రూపకల్పన
- ప్రతి కార్యకర్త యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి
- ప్రతి కుటుంబానికి యాప్‌ను చేరువ చేయాలి
- ప్రజా సమస్యల నమోదుకు ప్రత్యేక వేదికగా ఉపయోగం
- పార్టీ కార్యక్రమాలు, సమాచారానికి యాప్ కీలకం
- ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్
విజయవాడ, ఆంధ్రప్రభ : పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలను ఒకే వేదికపై అనుసంధానించేలా రూపొందించిన ‘జగనన్న 2.0’ యాప్ ద్వారా పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన యాప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. పార్టీ కార్యక్రమాలు, తాజా సమాచారం, సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యల నమోదు, పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన వివిధ సేవలను యాప్ ద్వారా సులభంగా పొందవచ్చని తెలిపారు. డిజిటల్ సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయడంలో ‘జగనన్న 2.0’ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

ప్రతి కార్యకర్త తప్పనిసరిగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నమోదు చేసుకోవాలని, తమ పరిధిలోని ప్రతి అభిమాని, ప్రతి కుటుంబానికి యాప్‌ను చేరువ చేసే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని స్పందించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలకు ‘జగనన్న 2.0’ ప్రధాన వేదికగా నిలుస్తుందని అవినాష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, పార్లమెంట్ కార్యదర్శి ఆళ్ల చెల్లారవు, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాజీ కార్పొరేటర్లు రహీనా నాహీద్, కలపాల అంబేద్కర్, చింతల సాంబయ్యతో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
