ఢిల్లీ పేలుడు.. ఎవరెవరు ఏమన్నారు..?

ఢిల్లీ పేలుడు.. ఎవరెవరు ఏమన్నారు..?
ఢిల్లీలో పేలుడు ఘటనతో ఒక్కసారిగా దేశం హై అలెర్ట్ అయ్యింది. కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ పేలుడుకు ఉపయోగించిన కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు, ఆ కారు యజమానితో పాటు, గతంలో కారు ఓనరును కూడా అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన నదీమ్‌ఖాన్ పేరిట కారు రిజిస్టర్ అయ్యింది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు ఆ కారును కొనుగోలు చేసిన మహ్మద్ సల్మాన్‌ను కూడా గురుగ్రామ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ప్రధాని మోదీ..
ఢిల్లీ ఘటన బాధాకరమని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ తెలియచేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎప్పటికప్పుడు మోడీ అమిత్ షాతో మాట్లాడుతూ వివరాలు తెలుసుకుంటున్నారు. ఢిల్లీ పోలీసులతో మాట్లాడారు.. ఆయన ఘటనాస్థలికి వెళ్లడంతో పాటు హాస్పటల్ కి వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించారు. ఘటన పై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. ముంబాయిలో భారీగా తనిఖీలు చేపట్టారు. అలాగే అక్కడ మరింత భద్రత పెంచారు.
ఏపీ సీఎం చంద్రబాబు..
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలియచేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎక్స్ వేదికగా సానుభూతి తెలియచేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
ఢిల్లీలో జరిగిన ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమానుష ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు.
కేటీఆర్..
అమాయక ప్రజలు పలువురు మరణించారనే వార్త హృదయ విదారకమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కోన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఎక్స్ ద్వారా తెలియచేశారు.
